ప్రేక్షకుల మనస్సుతో 'దోబూచి'

updated: May 7, 2018 10:11 IST
ప్రేక్షకుల మనస్సుతో 'దోబూచి'

నాటకం సమకాలీనం, సార్వజనీనం, సార్వకాలికం. అయనా వేనవేల సంవత్సరాల వెనుక నున్న పుటలను కూడా మన కళ్లముందు పరిచేది నాటకం. గతంలోకి తొంగిచూసి అవరోధాలను, అసమానతలను, కలతలను, కన్నీళ్లను చూసి వాటికి పరిష్కారాలు చూపుతూ ఆ సమస్యలకు తిలోదకాలు ఇవ్వడానికి వేదిక నాటకం. మనిషితనాన్ని మనిషిలో తట్టిలేపడానికి విలువైన పదునైనఆయుధం నాటకం. చుట్టూ ఉన్న పరిస్థితులను నూతన దృష్టితో అవలోకింపజేయడానికి ప్రోత్సహిస్తాయి’’ అని అంటాడు బెర్నార్డ్ షా.

స్టేజీ నాటకాలకు టైమ్ అయిపోయింది అంటూనే ఉంటున్నారు.మరో ప్రక్క ఎక్కడ పడితే అక్కడ స్టేజ్ నాటకాలు వేస్తున్నప్పుడు జనం విరగబడి చూస్తున్నారు. అయితే సత్తా ఉన్న నాటకాలకే ఆ ఆదరణ దక్కుతోంది. అటువంటి నాటకాల్లో ఒకటి 'దోబూచి'. ప్రముఖ హాస్య నాటక రచయిత శంకరమంచి పార్ధసారధి రచించిన ఈ నాటకం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరిస్తోంది. 
శ్రీ తల్లావఝల సుందరం గారి దర్శకత్వంలో రూపొందిన ఈ నాటకం..నిన్న హైదరాబాద్ బిహెచ్ ఈఎల్ లో ప్రదర్శించటం జరిగింది.  కమ్యూనికేషన్ గ్యాప్ తో సరదాగా సాగిపోయే నాటకం, పెద్దవాళ్లని, చిన్న పిల్లల్లా చూసుకోవాలి..ఆ వయస్సుల్లో వాళ్లను వేధించి, విసిగించిద్దు అనే చిన్న సందేశంతో నాటకం ముగుస్తుంది.  ప్రేక్షకుల పెదవులపై నవ్వుల దొంతరలు, హాస్యపు గిలిగింతలు, చప్పట్లుతో  వేదిక దద్దరిల్లిపోయింది. 

కొడుకులు లేని ఓ పెద్దాయన, ఆయన భార్య  తన ఇద్దరు కూతుళ్ల వద్దే జీవిత చరమాంకం గడపాలని అనుకుంటారు. అయితే ఇద్దరిని ఇద్దరు కూతుళ్లు పంచుకుంటారు. దాంతో దాదాపు నలభై ఏళ్ల పాటు కలిసి కాపురం చేసిన ఆది దంపతులు లాంటి ఆ జంట..కేవలం సంవత్సరానికి ఓ వారం రోజులు కలుసుకునే పరిస్దితి ఏర్పడుతుంది. సంవత్సరమంతా విడివిడిగా ఉంటారు. ఆ వియోగం లోంచి పుట్టుకొచ్చిన కామెడికి ఓ చిన్న మెలిక వేసి చేసిన నాటకం ఇది. 

అందులోనూ  మామగారికేమో..చిన్న అనారోగ్యం వచ్చినా... ఎక్కవ పరీక్షలు చేయించి అందరినీ ఇబ్బంది పెడుతూండే క్యారక్టరైజేషన్.  అత్తగారేమో..భక్తి పేరుతో పూజలు,పునస్కరాలు, వ్రతాలు..
ఈ ధాటికి తట్టుకోలేక..అల్లుళ్లిద్దరూ..నాటకం ఆడి..మామ, అత్తలకు బుద్ది చెప్దామనకోవటం మెయిన్  ప్లాట్ అయితే...అనుమానంతో  భార్యని హింసిస్తూండే  ప్రక్కింటి ప్రసాదరావు అనే పాత్ర సబ్ ప్లాట్ గా నడుస్తుంది. అనుమానం భర్తకి బుద్ది చెప్పే ప్రయత్నంలో ఆ భార్య తెర లేపిన నాటకం..ఈ అల్లుళ్ల నాటకంతో కలిసిపోయి గందరగోళంగా మారుతుంది. అందులోంచి పుట్టే ఫన్ నాటకాన్ని నిలబెట్టి నవ్వులు పువ్వులు పూయించింది. 

ఇక   నాటకం సంపూర్ణంగా పండాలంటే అది టీమ్ సమష్టి కృషి అని చెప్పాలి. రచయత రాసిన దాన్ని ఒక దర్శకుడు,  నటీనటులు...  వారి వారి అనుభవం ,ప్రావీణ్యం కలిపి రంగరిస్తూ నూటికి నూరుపాలు మమేకమైనప్పుడే ఫలితం చేతికందుతుంది.  అది అంత ఆషామాషి వ్యవహారం గాదు. దానికి తోడు నాటకంలోని నటుడు/నటి అభినయానికీ, ఆ పాత్రోచితంగా కదలికల నియమాలకు అనుగుణంగా రంగస్థల అలంకరణ ప్రధానం.ఇవన్నీ ఫెరఫెక్ట్ గా కుదిరిన నాటకం ఇది. 

ఈ నాటకంలో..

కృష్ణమూర్తి ..ఫణి ప్రకాష్

సుబ్బలక్ష్మి... నవీన

మామగారు ..జెన్నీ

ప్రక్కింటివాడు... సురేంద్ర

తోడల్లుడు...మహేంద్ర

ప్రక్కింటివాడి భార్య..లలిత రాజ్

తమ తమ పాత్రల్లో నటించారు అనటం కంటే జీవించారు అనటం సబబు. ఎప్పటిలాగే తల్లావఝల సుందరంగారు దర్శకత్వ ప్రతిభ అమోఘం అనిపించింది


Tags: dobuchi natakam, phaniprakash, naveena, Tallavaghula sundaram, shankaramanchi pardhasaradhi

comments