పాతబంగారం' కొండలరాయుని చలనచిత్ర వజ్రోత్సవ సంబరం

updated: May 2, 2018 17:33 IST
పాతబంగారం' కొండలరాయుని చలనచిత్ర వజ్రోత్సవ సంబరం

మండు వేసవి ప్రతాపాన్ని తగ్గించుకున్న భానుడు ఎందుకో మబ్బుచాటుకు వెళ్తున్నాడు. వాతావరణం చల్లబడసాగింది. కార్మిక దినం నాటి సాయంత్రం ఆరు గంటలప్రాంతం. ఎ.జి. కాలనీ సమీపంలో వుండే సిద్దార్థ నగర్ (నార్త్) వీధిలో పన్నెండవ నంబరు ఇంటిముందు ఒకదాని వెంట మరొకటిగా కార్లు, క్యాబ్ లు, ఆటోలు, మోటారు సైకిళ్ళు వచ్చి ఆగుతున్నాయి. ఆ ఇంటిలో ఏదైనా సంబరం జరుగుతోందేమో అని ఊహించు కుందామంటే, ఎక్కడా పందిరిగాని షామియానా కానీ కనపడడం లేదు. కానీ వాహనాల్లోంచి దిగిన ఒక్కొక్కరినీ గుమ్మం వద్ద సాదరంగా ఆహ్వానిస్తున్నారు శ్రీ పోలిశెట్టి నాగేశ్వరరావు దంపతులు, శ్రీ బాలకృష్ణ గారలు. అతిథులు ఒక్కొక్కరే మొదటి అంతస్తుకు చేరుకుంటున్నారు. ఆ చుట్టుప్రక్కల ఇళ్ళలో వుండే వాళ్లకు అప్పుడు అర్థమైంది.... పన్నెండవ నంబరు ఇంటిలో యేదో కార్యక్రమం జరగబోతోందని. చుట్టు ప్రక్కల ఇళ్ళలో కొందరికి అనుమానం వచ్చింది... నాగేశ్వరరావు గారి అమ్మాయి మౌనిక పెళ్లి నిశ్చితార్ధం కాదు కదా అని! వెంటనే సమాధానపడ్డారు, ఆ శుభకార్యానికి ఇరుగు పొరుగిళ్ళ వారిని ఆహ్వానించకుండా ఉంటారా అని. అప్పుడే కారులో ప్రముఖ సినీ నటులు రావి కొండలరావు గారు కారు దిగారు. నాగేశ్వరరావు గారు సాదరంగా వారిని తోడ్కొని వెళ్లి సోఫాలో కూర్చుండబెట్టి వెండి గ్లాసుతో చల్లటి చెరుకు రసం చేతికిచ్చారు. “మహత్తరంగా వుంది మహాశయా” అంటూ ఆ కొంగ్రొత్త సంప్రదాయానికి మురిసిపోతూ అతిథేయి జబ్బ చరిచి చెరుకు రసాన్ని సేవించారు. మెల్లిగా మిద్దె మెట్లు ఎక్కుతూ మొదటి అంతస్తుకు చేరుకున్న కొండలరావు గారికి అప్పటికే ఆ సభాస్థలికి చేరుకున్న సాహిత్య సంగీత సమాఖ్య సభ్యులు, గౌరవ అతిథులు ఘన స్వాగతం పలికారు. కొండలరావు గారి రాకకు ముందు అక్కడకు విచ్చేసిన అతిథులలో ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు గారు, ముప్పలనేని శివ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు; ప్రముఖ సినీ కథా, సంభాషణల రచయిత రాజేంద్రకుమార్ గారు, వెండితెర వేలుపులు జయప్రకాష్ రెడ్డి గారు, రాళ్ళపల్లి గారు,  వైజాగ్ ప్రసాద్ గారు; ప్రసారభారతి విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పద్మనాభరావు గారు, దూరదర్శన్ విశ్రాంత ప్రయోక్త విజయ దుర్గ గారు, మరెందరో ప్రముఖులు చల్లని చెరకు రసాన్ని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు.

ఇంతకీ ఈ సంరంభానికి కారణం, రావి కొండలరావు గారి చలనచిత్ర జీవిత షష్టిపూర్తి సందర్భంగా ఇష్టులతో ఏర్పాటు చేసిన ఇష్టగోష్టి కార్యక్రమం. పరిచయ కార్యక్రమాలు అయ్యాక సరిగ్గా 6.30 గంటలకు అతిథేయి తనయ చిరంజీవి మౌనిక ప్రార్థనా గీతం ఆలపించింది. సాహిత్య సంగీత సమాఖ్య కార్యదర్శి ఆచారం షణ్ముఖాచారి గారు స్వాగతం పలుకుతూ, రావి కొండలరావు గారి సినీ ప్రస్థానం పొన్నలూరి బ్రదర్స్ వారు నిర్మించి 01-05-1958న విడుదల చేసిన ‘శోభ’ సినిమాతో ఆరంభమై ఈ గోష్టి జరుగుతున్న రోజుకి అరవై వసంతాలు పూర్తి చేసుకుందని, కొండలరావు గారు ఇటీవల నటించిన ఇంకా పేరు నిర్ణయించని సినిమా త్వరలో విడుదల కానుందని, వారి నటనా ప్రస్థానం అప్రతిహతంగా సాగిపోతూ వుందని తెలియజేశారు. ఇది అభినందన సమావేశం కాదని, కొండలరావు గారు నటుడుగా ఈ అరవై వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆస్వాదించిన మధుర క్షణాలు, చలనచిత్ర మహానుభావులతో వారి సాంగత్యం, అనుభవాలను పంచుకొనే సన్నిహితుల సమ్మేళనమని తెలిపారు. విజయచిత్ర వంటి ప్రతిష్టాత్మక సినీ పత్రికకు 26 ఏళ్ళపాటు సంపాదకునిగా చేసిన సేవలు, రంగస్థల నటునిగా ‘కుక్కపిల్ల దొరికింది’ వంటి నాటక రచయితగా అందుకున్న బహుమతులు, వందకు పైగా రేడియో నాటికలకు రచయితగా, నటుడిగా అందించిన సేవలు, బుల్లితెర కోసం ‘కన్యాశుల్కం’ నాటకానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించి 9 నంది బహుమతులను గెలిపించిన మధుర స్మృతులు... ఇలా చెప్పుకుంటూ వెళితే ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి కళారంగపు అమ్ముల పొదిలో ఎన్నో నాగాస్త్రాలు వున్నాయని.... కానీ, నేటి గోష్టి కార్యక్రమంలో సినీ రంగ ప్రస్థాన విశేషాలను మాత్రమే చర్చించుకుందామని షణ్ముఖాచారి  తెలియజేశారు. ఈ గోష్టిలో అందరినీ ప్రశ్నలు సంధించమని, వాటికి కొండలరావు గారు తన స్పందన తెలియజేస్తారని ప్రకటించారు. తరవాత కొండలరావు గారిని పుష్పమాలాంకృతులను చేసి, దుశ్శాలువలతో సత్కరించారు.ప్రశ్నలు సంధించినవారిలో ముప్పలనేని శివ గారు, రేలంగి నరసింహారావు గారు, జయప్రకాష్ రెడ్డి గారు, వైజాగ్ ప్రసాద్ గారు, పద్మనాభరావు గారు, రాజేంద్రకుమార్ గారు, విజయదుర్గ గారు, వెంకట రమణ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణవేణి గారు, శేఖర్ గారు వున్నారు. ఆ ప్రశ్నలకు కొండలరావు గారు తనదైన రీతిలో స్పందించారు. ఆ పరిమళ సారాంశం వారి మాటల్లోనే.

నేను నటించిన మొదటి చిత్రం పొన్నలూరి బ్రదర్స్ వారి ‘శోభ’. ముందు చేరింది కథావిభాగంలో సభ్యుడిగా అయినా,ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాను. ఒక దృశ్యంలో రామారావు, అంజలీదేవి, హేమలత, రమణారెడ్డి వుండగా ఒక అయోమయం డాక్టరు వస్తాడు. అతడు వస్తూనే పేషంటు ఎవరో తెలుసుకోకుండా ఎదురుగా ఎవరుంటే వారి గుండెలమీద స్టెతస్కోపు పెట్టి హడావుడి చేయాలి. ఆపాత్రకోసం ఒకాయన వచ్చాడు. అతనికి దృశ్యం వివరించి డైలాగులు చెప్పాను. రామారావు, అంజలీదేవిని చూడగానే అతడు కంగారు పడుతున్నాడు. అది గమనించిన దర్శకుడు కమలాకర కామేశ్వరరావు “అతనివల్ల టైము, ఫిలిమూ రెండూ వృధా అయ్యేలా వున్నాయి. ఎందుకూ...ఆ వేషం మీరే వెయ్యండి” అన్నారు. అలా అప్రయత్నంగా నేను నటుడిగా వెండితెర మీద తొలిసారి కనిపించాను. అదే సంస్థ తరవాతి ప్రయత్నంగా ‘దైవబలం’ పేరుతో ఒక జానపద చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తూ నిర్మాతే కథ రాసి, దర్శకత్వం నిర్వహించేందుకు ఉద్యుక్తుడయ్యారు. నాకు అక్కడి పరిస్థితులు నచ్చక మళయాళ దర్శక నిర్మాత జోసెఫ్ తలియత్ ఆహ్వానిస్తే అక్కడ చేరిపోయాను. సహాయ దర్శకునిగా పనిచేస్తూనే ముగ్గురు వీరులు, ప్రేమలో ప్రమాదం, కీలుబొమ్మలు వంటి సినిమాల్లో కొన్నిపాత్రలు ధరించాను. బి.ఎన్.రెడ్డి గారి వద్ద ‘పూజాఫలము’ చిత్రానికి, కమలాకర గారి వద్ద ‘నర్తనశాల’ సినిమాకి సహకార దర్శకునిగా పనిచేశాను. కొన్నాళ్ళకు ‘దాగుడుమూతలు’ సినిమాలో ఏకంగా పన్నెండు సీన్లు వుండే డాక్టరు వేషం వచ్చింది. అందులో నా భార్య రాధాకుమారికి కూడా వేషం ఇచ్చారు. ఆమెకు అదే తొలి చిత్రం (తేనెమనసులు కాదు). ఆ సినిమా మొదటిరోజు షూటింగుకు ఇద్దరం హాజరయ్యాం. సెట్లో సూర్యకాంతం, గుమ్మడి, రమణారెడ్డి, రామలింగయ్య, పద్మనాభం వున్నారు. మద్యాహ్నం ‘లంచ్’ బ్రేక్ సెట్లోనే ఏర్పాటు చేశారు. పెద్దవాళ్ళందరికీ ఓ ప్రక్కన టేబుళ్లు వేసి, మాదంపతులకు వేరేగా చిన్న టేబుల్ వేసి భోజనాలు వడ్డించారు. అందరూ కలివిడిగా భోజనం చేస్తున్నారు. సూర్యకాంతం కళ్ళు  మా ఇద్దరిమీద పడ్డాయి. “ఓసి దీని మొహం సంతకెళ్ళా. ఇవాళ వచ్చి కొత్తగా ఈ సినిమాలో వేషం వేస్తోందీ పిల్ల. ఆ డాక్టరు ప్రక్కన కూర్చుని కబుర్లు చెబుతూ భోంచేస్తోంది. ఇలాగే చెడిపోతారు పిల్లలు” అంటూ మాకు వినపడేలా మాట్లాడుతోంది... హెచ్చరిస్తున్నట్లు. ఆమె ప్రక్కనే కూర్చున్న సహాయ దర్శకుడు పెండ్యాల నాగాంజనేయులు కల్పించుకొని “అమ్మా!వాళ్ళిద్దరూ భార్యాభర్తలు” అని చెప్పడంతో సూర్యకాంతం అవాక్కయింది. తొందరపాటుకు నొచ్చుకున్న సూర్యకాంతం మమ్మల్ని దీవిస్తూ నాతో “బాబూ...ఏదో ఒక వృత్తిని నమ్ముకోండి. ఈపని ఆపనీ అంటే ఎందులోనూ రాణించలేరు” అంటూ సలహా ఇచ్చింది. నేను వెంటనే నిర్ణయం తీసుకున్నాను... నటనను నమ్ముకోవాలని. అలా దాగుడుమూతలు సినిమా నా నటనకు పునాది వేసింది.  అప్పుడు నాకు 32 ఏళ్ళు. తెల్ల ప్యాంటు, తెల్లటి పొడుగు చేతుల చొక్కా ఇన్-షర్టు చేసుకుని, ఒత్తైన నల్లటి ఉంగరాల జుట్టుతో వుండేవాణ్ణి. పద్మశ్రీ వారు ‘ప్రేమించి చూడు’ సినిమా కోసం ముళ్ళపూడి రమణ గారిని స్క్రిప్టు రైటరుగా తీసుకున్నారు. తమిళ మాతృక ‘కాదలిక్క నేరమిల్లై’ లో హీరో రవిచంద్రన్(తెలుగులో అక్కినేని) తండ్రి వేసిన పాత్రను బడి పంతులుగా మలిచి నాచేత నటింపజేయాలని స్క్రిప్టు రాస్తూ, నా పేరు దర్శకనిర్మాత పి.పుల్లయ్య గారికి సిఫారసు చేసి, నన్ను వెళ్లి కలిసిరమన్నారు. పుల్లయ్య గారిని కలిసి “రమణ గారు పంపించారండి. హీరోగారి తండ్రి వేషం కోసం మిమ్మల్ని కలవమని” అంటుండగానే నన్ను ఎగాదిగా చూసి, “ఫస్ట్ గెటవుట్. నీకు బుద్దిలేదా...ఆ రమణకి బుద్దిలేదా....లేకుంటే నాకు బుద్దిలేదా...నువ్వు నాగేశ్వరరావుకి తండ్రివా? అయామ్ నాట్ ఎ ఫూల్. ప్లీస్ గో” అన్నారు. తరవాత కొడవటిగంటిన కుటుంబరావు, ప్రతిభాశాస్త్రి, రమణ గారు పుల్లయ్యను కలిసి “కొండలరావు అలావుంటాడు కానీ, పెద్ద పాత్రలు బాగా చేస్తాడు” అని నచ్చజెప్పారు. తెలుగు మేస్టారి పాత్రను నటించి చూపాను పుల్లయ్య గారికి. వెంటనే నన్ను కారెక్కించుకుని జార్జి టౌన్ లో ఒక విగ్గుల షాపుకు తీసుకెళ్ళి, నాలుగు రకాల ముసలి విగ్గులు తగిలించి చూసుకొని “యస్...యు ఆర్ డూయింగ్ దట్ క్యారక్టర్” అన్నారు ఆ ‘పులి’లాంటి పుల్లయ్య గారు. ఇంకేముంది పాత్రలో విజ్రుంభించాను. అక్కినేని అనుమతి తీసుకున్న తరవాతే “అరేయ్, గాడిదా” అనగలిగాను. అక్కినేని చాలా స్పోర్టివ్. రమణ పుణ్యమా అంటూ నా పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. నా ప్రమేయం లేకుండానే వరసగా 5 సినిమాల్లో బుక్కయ్యాను. ఆ తరవాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికి ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించాను...నటిస్తున్నాను...నటిస్తాను కూడా!. నాది చిన్న వయసే అయినా పెద్దవారయిన నరసరాజు, కమలాకర, రాజేశ్వరరావు, ఆరుద్ర, బాపు-రమణ, సముద్రాల, ఘంటసాల వంటి వారితో సాంగత్యం చేస్తూ సినిమా నిర్మాణ మెళకువలు గమనిస్తూ, నా హాస్యంతో వారిని అలరిస్తూ పెరిగాను. ఆరోజుల్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కళామతల్లికి రెండు కళ్ళులాంటివారు. వారు ఏడు గంటలకల్లా ఠంచనుగా సెట్లోకి వచ్చేవారు. వారినుంచే సమయపాలన, క్రమశిక్షణ నాకు అలవడింది. రామారావు గారు సెట్లో గంభీరంగా వుండేవారు. ఆయన సెట్లో వుంటే అందరికీ హడల్. అలాగని కలుపుగోలుగా ఉండరని కాదు. అక్కినేని గారయితే సెట్లో సందడి చేసేవారు. ఎన్టీఆర్ నాకు వరసగా ఎనిమిది సినిమాలలో నటించే అవకాశం కల్పించడమే కాకుండా వైవిధ్యమైన పాత్రలు నాచేత పోషింజేశారు. ఇక అన్నపూర్ణా సంస్థ నేను ఆశించినదానికంటే ఎక్కువగానే పారితోషికం అందించేది. “మీలో యే దర్శకుని దగ్గరైనా బాధపడిన సంఘటనలున్నాయా” అని అడిగినదానికి నా సమాధానం....1975లో సీనియర్ దర్శకులు తాతినేని ప్రకాశరావు గారు ఎన్టీఆర్, జగ్గయ్య, జమున, జయసుధ వంటి భారీ తారాగణంతో ‘సంసారం’ అనే సొంత సినిమా నిర్మిస్తున్నారు. వాహిని స్టూడియోలో ఎన్టీఆర్ తో నాకు సాయంత్రం ఆరు గంటలకు కాల్షీటు వుంది. నేను ఐదున్నరకల్లా కారు నడుపుకుంటూ స్టూడియోలోకి అడుగుపెట్టాను. సెట్ బయట దర్శకుడు పచార్లు చేస్తున్నారు. నేను నమస్కరించి మేకప్ రూమ్ లోనికి  వెళ్ళబోతున్నాను. నా మీద ఫైర్ అయ్యారు  ప్రకాశరావు గారు. “ఏమయ్యా. ఇప్పుడా వచ్చేది. సమయపాలన నేర్పాలా. అవతల ఎన్టీఆర్ మూడు గంటలకే వచ్చి కూర్చున్నారు. మీ ఇద్దరితో షాట్లు తీయాలి. ఆయామ్ సారీ” అంటూ అందరిముందూ చెడామడా తిట్టేశారు. నన్ను సమాధానం కూడా చెప్పనీయలేదు. నేను తిన్నగా మేకప్ రూముకు వెళ్ళిపోయాను. మేకప్ వేయించుకుంటున్నానన్న మాటేగానీ, నాకు దుఃఖం ఆగడం లేదు. నేను ఎవరి దగ్గరా మాట పడలేదు. మేకప్ మ్యాన్ కు అర్ధం కావడం లేదు. కాసేపయ్యాక దర్శకుడు మేకప్ రూమ్ లోకి వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి “సారీ కొండలరావ్. తొందరపడి నీ మీద ఫైర్ అయ్యాను. రామారావు గారు ఉదయం కాల్షీట్ త్వరగా ముగించుకొని ఇంటికి వెళ్ళకుండా తిన్నగా ఇక్కడకు వచ్చేశారట. ప్రొడక్షన్ స్టాఫ్ ఆయనకు కాల్షీటు ఆరింటికి అని చెప్పారట. విశ్రాంతి తీసుకుంటున్నారు. నిన్ను ఆరింటికి రమ్మన్నారట మా స్టాఫ్ వాళ్ళు. మీరు అరగంట ముందే వచ్చారు. జరిగినదానికి బాధపడుతున్నాను” అని అంటున్నారు. నాకు దుఃఖం ఆగడంలేదు. కాసేపయ్యాక షాట్ మొదటి టేకులోనే ఒకే అయింది. ఆరోజుల్లో దర్శకులు తప్పుచేస్తే పశ్చాత్తాప పడేవారు. ఇక విజయచిత్ర మూతపడడానికి కారణం అడిగారు కాబట్టి చెబుతున్నాను. విజయచిత్ర మాసపత్రిక కావడం ఒక ప్రతికూలత. దానికితోడు సితార, జ్యోతిచిత్ర వంటి వారపత్రికలు మార్కెట్లో విడుదలకావడంతో తాజా సమాచారం వాటి ద్వారా అందుబాటులోకి వచ్చింది. పైగా డాల్టన్ ప్రెస్ కు హిందీ సినిమాల పోస్టర్ల ప్రింటింగ్ పనులు అధికం కాసాగాయి. దాంతో విజయచిత్ర పబ్లికేషన్ ఆపాల్సి వచ్చింది. దర్శకుడు ముప్పలనేని శివ చెప్పినట్లు విజయా సంస్థ నన్ను విశ్వాసంలోకి తీసుకుంది. అందుకే నాకు గౌరవం పెరిగింది. బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం వంటి సినిమాల నిర్మాణనిర్వహణ బాధ్యత నాకు అప్పగించింది. నాది చాలా నిరాడంబర జీవితం. మంచే చెప్పడమే కాని చెడు చెప్పడం నా చేతకాదు. అబద్ధాలు ఆడడం నా వొంటికి సరిపడని అంశం. ఉన్న వనరులతో తృప్తి చెందడం నా జీవన సరళి. సాయంకాలం పనిలేదనుకుంటీ పానగల్ పార్కుకు వెళ్లేవాడిని.  అక్కడ మల్లాది, పింగళి, మద్దిపట్ల సూరి, దైతా గోపాలం వంటి మహానుభావులు కూర్చుని సినిమా సాహిత్యం మీద చర్చలు జరుపుతుండేవారు. నేను ఒక మూల కూర్చుని సత్కాలక్షేపం చేసేవాడిని. నేను చేసే తెలుగు మేస్టారి వ్యవహారం, ఆరుద్ర గారికి యెంతో నచ్చింది. “అసలు ఈ తెలుగుమేస్టారనేవాడొకడు వున్నాడా” అనే సందేహం కూడా వెలిబుచ్చేవారు. ఒకసారి విజయనగరం వెళ్లినప్పుడు పనికట్టుకొని వెళ్లి మా తెలుగు మేష్టార్ని చూసి, మాట్లాడి వచ్చారు. “అరవయేళ్ళు చిత్ర పరిశ్రమలో వుండి, ఇంతటి అనుభవం గడించిన మీకు సొంతంగా సినిమా తీయాలని కానీ, దర్శకత్వం వహించాలని కానీ ఎప్పుడూ అనిపించలేదా” అని మీరు అడిగారు. దానికి నా సమాధానం... దర్శకుడు గుత్తా రామినీడు నాకొక సలహా ఇచ్చారు. నాకున్న కొందరు మిత్రుల్ని ప్రోగు చేసి, పెట్టుబడి పెట్టి దర్శకుడి అవతారం ఎత్తవచ్చు” అన్నారు. “నాకు అలాంటి మిత్రులూ లేరు...ఆలోచన అంతకన్నా లేదు” అన్నాను.  అయితే బుల్లి తెర కోసం గురజాడ అప్పారావు గారి ‘కన్యాశుల్కం’ నాటకాన్ని ఒక్క అక్షరం మార్చకుండా, యెంతో శ్రమించి సీరియల్ గా తీశాను. దానికి ఏకంగా తొమ్మిది నంది బహుమతులు లభించాయి. పీసపాటి నరసింహమూర్తి వంటి నాటకరంగ శ్రేష్టుణ్ణి ఒప్పించి అందులో లుబ్దావధానుల పాత్ర పోషింపజేశాను. అది నాకు తృప్తిని మిగిల్చింది. అలాగే ఉత్తమ సినిమా పుస్తకం గా ‘బ్లాక్ అండ్ వైట్’ కు, ‘బంగారు పంజరం’ సినిమాలో ఉత్తమ నటనకు, ‘పెళ్లి పుస్తకం’ సినిమా ఉత్తమ కథా రచనకు నాకు మూడు వైవిధ్య ట్రేడ్లలో నంది బహుమతులు లభించాయి. ఓపికగా నాసమాధానాలు ఆలకించిన మీకు ధన్యవాదాలు

అలా రెండున్నర గంటలసేపు గంగా ప్రవాహంలా సాగిన ఇష్ట గోష్టి కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.  చివరిగా అక్కినేని నాగేశ్వరరావుతో జరిగిన తెలుగు మేస్టారి సంభాషణం చెప్పి అందరినీ కడుపుబ్బ నవ్వించారు కొండలరావు గారు. ఆతిథ్య దాతలు నాగేశ్వరరావు దంపతులు వేడివేడి ఇడ్లీలు, రవ్వ కేసరి, చిరుధాన్యాలతో వండిన పొంగల్ వంటకాలను కొసరికొసరి వడ్డిస్తుంటే సంతుష్టిగా...అమితంగా కూడా మితాహారాన్ని ఆస్వాదించారు. సమయం తొమ్మిది గంటలు కావస్తోంది. ఇళ్ళకు వెళ్ళే ప్రయత్నంలో మెట్లు దిగుతుంటే చల్లని పిల్లతెమ్మెరలు అందరిశరీరాలను సేదతీర్చాయి. శుభకామన చెప్పుకుంటూ ఒక్కొక్కరూ సెలవు తీసుకొని కారులెక్కి వరసగా వెళుతుంటే.... ఏదో ముఖ్యమంత్రి ‘కాన్వాయ్’ వెళుతున్నట్లు గోచరించింది. ఇక సభాస్థలిని సర్దుకునే పనిలో పడ్డారు నాగేశ్వరరావు దంపతులు

ఆచారం షణ్ముఖాచారి


Tags: shobha movie, ravi kondala rao, sangeeta sahitya samakyam, acharam shanmukhachary

comments