నట యశస్వి కి శతజయంతి వేడుక

updated: July 10, 2018 21:16 IST
నట యశస్వి కి శతజయంతి వేడుక

8వ తేది ఆదివారం. చల్లని సాయంత్రం. చిరుజల్లులతో పుడమితల్లి సేదతీరుతోంది. కారణం ఆమెకూ తెలుసు. నూరేళ్ళు పూర్తిచేసుకున్న ఒక దివంగత మహనీయునికి తెలుగునాట శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ వేడుకలకు అంతరాయం కలిగించకూడదనే భానుడు తీక్షణత తగ్గించుకొని, తన నేస్తం వరుణునికి తేలిక వాతావరణం కలిపించమని ఆదేశించాడు. గత ఆదివారం రవీంద్రభారతి, శుక్రవారం శ్రీ సారథి  స్టూడియో, ఈ ఆదివారం మోతీ నగరంలో ఆ మహనీయునికి నివాళులు ఘనంగా జరుగుతున్నాయి. ఆ మహామహుడు ఇంకెవరో కాదు ... అశేష తెలుగు ప్రజానీకానికి తన సహజ నటనతో ముప్పిరులు గొల్పిన యశస్వి, నట సార్వభౌముడు సామర్ల వెంకట రంగారావు. ఆంధ్రదేశమంతటా ఆ యశస్వికి జేజేలు పలుకుతూ వుంటే, సాహిత్య సంగీత సమాఖ్య బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు గారి అధ్యక్షతన సమావేశమై, యస్వీ రంగారావు ప్రతిభా విశేషాలపై సమాఖ్యహ్ సభ్యులతో చర్చా గోష్టి నిర్వహించింది. తొలుత ఆరంభ వచనాలు పలుకుతూ యస్వీఆర్ తో తనకున్న సాంగత్యాన్ని సభ్యులతో పంచుకున్నారు. షూటింగు సమయాల్లో రంగారావు ఎలా వుండేవారో, తన ఫియట్ కారులో హుందాగా ఎలా కారు నడుపుతూ స్టూడియోకి వచ్చేవారో, భోజన విరామ సమయాల్లో సహనటులతో ఎంత సరదాగా వుండేవారో తెలియజేస్తూ తన అనుబంధాన్ని పంచుకున్నారు. మోడరన్ థియేటర్స్ వారు నిర్మించిన మొనగాళ్ళకు మొనగాడు చిత్రంతో రంగారావు తో కలిసి నటించే అవకాశం తనకు వచ్చిందని తెలిపారు. అందరూ రంగారావువును చూసి భయపడుతుంటే, తను మాత్రం వీలయినప్పుడల్లా అతని చెంతజేరి సన్నిహితంగా మెలిగేవాడినని, హాస్యంతో నవ్వించే వాడినని చెప్పారు. ఒకసారి తనతో రోజూ మాంసాహార భోజనం చేసి మొహం మొత్తుతోందని, తన ఇంటినుంచి కందిపచ్చడిలో ఇంగువ, కారం బాగా ధట్టించి పట్టుకొస్తే తినాలని ఉందని చెప్పారట. భార్య రాధాకుమారి గారితో చెప్పి రుబ్బురోలులో కందిపచ్చడి రుబ్బించి, ఒక పెద్ద డబ్బాలో తీసుకెళ్ళారట కొండలరావు గారు. భోజన విరామంలో  ఆ డబ్బా యస్వీఆర్ కు అందివ్వగా, అన్నమంతా ఆపచ్చడితో లాగించేసి ఖాళీ డబ్బా లైట్ బాయ్ తో పంపి ఆశ్చర్యపరచారని కొండలరావు గారు చెబుతుంటే, సభ్యులు నవ్వు ఆపుకోలేకపోయారు. రంగారావు దగ్గర పిట్టలను వేటాడే తుపాకి వుండేదని, ఒకసారి నర్తనశాల అవుట్ డోర్ షూటింగు మద్రాసు సమీపంలో వున్న తడ అనే గ్రామంలో జరుగుతుండగా, మద్రాసు నుండి రావలసిన మద్యాహ్న భోజనం ఆలస్యమైందని, దాంతో ఉగ్రుడైన రంగారావు గాలిలోకి తుపాకి పేలిస్తే, నిర్మాతలతో సహా నటీనటులు, సాంకేతిక సిబ్బంది తలో దిక్కుకు పరుగు తీశారని, ఆ పరుగులో నిర్మాత శ్రీధరరావు లుంగీ జారిపోయిందని చెప్పి నవ్వించారు. మరొకసారి భలేకోడళ్ళు సినిమా షూటింగులో తను, బొడ్డపాటి, అల్లు రామలింగయ్య ఒక సన్నివేశంలో నటించాల్సి వుండగా రిహార్సల్స్ లో రామలింగయ్య బొడ్డపాటికి ఎలా నటించాలో సూచనలిస్తుంటే, రంగారావు “ఏమిటి రామలింగయ్యా. డైరెక్టరువు నువ్వా, బాలచందరా. నీ సంగతి చూసుకో” అనగానే అల్లు రెండు చేతులెత్తి నమస్కరించిన విషయం కొండలరావు గారు సభ్యులతో పంచుకున్నారు. ఇలాంటి విశేషాలు, జోకులు ఎన్నో చెప్పారు. తరవాత ప్రతి సభ్యుణ్ణి రంగారావు గారి నటనా వైదుష్యాన్ని గురించి తమకు తోచిన అభిప్రాయాలు వెల్లడించాలని చెప్పి అందరిచేతా మాట్లాడించారు. అద్దేపల్లి శ్రీమన్నారాయణతో ఈ చేర్చా గోష్టి ప్రారంభమై  సుంకర రామకృష్ణ గారితో పూర్తయింది. ఈ చర్చలో ప్రముఖ సినీ సంభాషణల రచయిత రాజేంద్రకుమార్ గారు, ప్రముఖ చిత్రకారుడు చిట్యాల విఠోబా అంబాజీ గారు, సినీ హిష్టోరియన్ పురాణం వెంకట రమణ గారు, పోలిశెట్టి నాగేశ్వరరావు గారు, రాజగోపాల్ గారు, కార్యదర్శి షణ్ముఖాచారి గారు, అరుణకుమారి గారు తదితరులు వేర్వేరు సినిమాల్లో రంగారావు నటనమీద తమ అభిప్రాయాలు తెలిపారు. ముఖ్యంగా పురాణం వెంకట రమణ ఎస్వీఆర్ నటనా పర్వాన్ని 1960 నుంచి 1966 వరకు తనదైన శైలిలో దర్శకుని సూచనలకు అనుగుణంగా నటించిన కాలంగా, ఆ తరవాత తన హావభావాలే నటనాంశంగా మారిన సన్నివేశాలను సోదాహరణంగా విశ్లేషించారు. అందుకు మిస్సమ్మ, పాతాళభైరవి, బంగారు పాప, తోడికోడళ్ళు, గుండమ్మ కథ, ఆత్మబంధువు, కలసివుంటే కలదు సుఖం, తోడూ నీడా, బాంధవ్యాలు, మొనగాళ్ళకు మొనగాడు, జగత్ కిలాడీలు, జగత్ జెంత్రీలు, జగత్ జెట్టీలు, భక్త ప్రహ్లాద చిత్రాలలో ఎస్వీఆర్ నటనాశైలి, ఆహార్యంలో మార్పులు వంటి విషయాలను సవివరంగా విశ్లేషించారు. రాజేంద్రకుమార్ గారు ప్రేమనగర్ సినిమాలో అతిచిన్న పాత్రను ఎలా రాణింపజేసింది సంభాషణల తో సోదాహరణంగా విశ్లేషించారు. దేవుడు చేసిన మనుషులు సినిమాలో రామారావు కు రంగారావు తన తండ్రి అని తెలిసినా, దొంగతనాన్ని తనపై వేసుకొని ఇంటినుంచి వెళ్లిపోతుంటే రంగారావు అనుభవించిన విషాద సంఘటనను చక్కగా వివరించారు. పోలిశెట్టి నాగేశ్వరరావు గారు షావుకారు, మాయాబజార్ సినిమాల నటన గురించి చెప్పారు. షావుకారులో సున్నం రంగడు అనే విలన్ పాత్రను పోషించేందుకు బీడీ ముట్టించుకునే విధానాన్ని ఒక రిక్షావాడిని గమనించి అనుసరించారని, ఆయన బాడే లాంగ్వేజ్ ఎలావుండేదో చెప్పుకొచ్చారు. షణ్ముఖాచారి గారు ఒక ఇంటి పెద్దగా తోడూ నీడా, పండంటి కాపురం సినిమాలలో ఎంతగా ప్రేక్షకులను ఏడిపిస్తూ సన్నివేశాలను రక్తి కట్టించిన విధానం విశ్లేషించారు. రాజగోపాల్, రామకృష్ణ గారలు క్లుప్తంగా తమ అభిప్రాయాలు తెలిపారు. ఆద్యంతం సభ్యులను ఆకట్టుకున్న పురాణం వెంకట రమణను అభినందిస్తూ కొండలరావు గారు ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. వివాహభోజనంబు సనివేశాన్ని గుర్తుచేస్తూ సభ్యులకు లడ్డుండలు, బాదుషాలు, అరిసెలు, చేగోడీలు తృప్తి తీరా అందించి తేనీరు రెండు దఫాలు గా ఇచ్చి ఆత్మారాముణ్ణి సంతృప్తి పరచారు కార్యనిర్వాహకులు. ఈ సందర్భంగా కొన్ని సినిమాలలో రంగారావు పలికిన సంభాషణలను సభ్యులు గుర్తు చేసుకున్నారు. వాటిలో కొన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాము.

చిత్రం: తోడికోడళ్ళు 

అన్నపూర్ణా వారి తోడికోడళ్ళు సినిమాలో మతిమరుపు లాయరు పాత్రలో రంగారావు ఒదిగిపోయారు. తోడికోడళ్ళ మధ్య కీచులాటలు రేగాయని తెలుసుకున్న కన్నాంబ తల్లడిల్లిపోయి భర్తవద్దకు వెళ్ళింది. కోర్టుకువెళ్ళే హడావుడిలో వున్న రంగారావుతో కన్నాంబ “ఇంటివిషయాలు మాట్లాడే తీరిక మీకు లేదు. నేనోక్కర్తే ఎలా చావను” అంటుంది. అందుకు మతిమరుపు రంగారావు ఇచ్చే సమాధానం “నువ్వొక్కర్తెవేం. కూడా ఎవరినైనా తోడు తీసుకో” అంటూ చావుకు ఎవరినైనా తోడూ తీసుకోమంటాడు... అసలు సంగతి పట్టించుకోకుండా. ఇంకోల్ సన్నివేశంలో అక్కినేని, సావిత్రి పిల్లాడితో కలిసి ఇంటినుండి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంటారు.కె కన్నాంబ ఆదుర్దాగా రంగారావు వద్దకు వచ్చి “వాళ్ళు వెళ్లిపోతున్నారండీ” అంటుంది. పరాకుగా “శుభం” అంటాడు రంగారావు. “శుభమా ఏమిటండీ. సుశీలా వాళ్ళు ఇల్లు వదలి వెళ్తున్నారు” అంటుంది కన్నాంబ. “సుశీలా వాళ్ళా. అయితే తొందరగా రమ్మను” అంటాడు. “కాదండీ ఇక ఎప్పటికీ తిరిగి రారు” అంటుంది కన్నాంబ. “అయితే అడ్రసు రాసి ఉంచుకో” అంటాడు పరధ్యాన్నంగా రంగారావు. “నా కర్మం, నా తలరాత. ఇంత మతిలేని మొగుడితో చావమని నా నెత్తిన రాశాడు” అంటుంది. రంగారావు ప్రశ్న “ఎవరు” అని(!).

మరొక సన్నివేశం. కన్నాంబ సావిత్రి కొడుకును పెంచిన మమకారంతో మరువలేదు. బాబు ఆకలి అంటూ అర్ధరాత్రి లేచినట్లు కలగంటుంది. అలవాటు ప్రకారం సున్నుండలు తీసి పక్కలో వెదుకుతుంది. అది తన భ్రమ అని తెలుసుకొని నిద్రపోతున్న రంగారావువును లేపుతుంది. “సావిత్రి మీద కేసు వేసి బాబును తెచ్చుకుందా”మంటుంది. “బాబును కోరడానికి మనకు హక్కులేదు” అని నిద్రలోనే చెప్పినప్పుడు కన్నాంబ “కోర్టుకేం తెలుసు. కోర్టుకు కళ్ళు లేవు” అంటూ వాపోతుంటే రంగారావు సహజ నటనతో నిద్రకు
ఉపక్రమించినప్పుడు అద్భుత నటన చూసి తీరాల్సిందే.

పాండవ వనవాసము

పాండవ వనవాసము చిత్రంలో చిత్రసేనుడు  దుర్యోధనుని కుటిల ఘోషయాత్రకు ముగింపుగా పరీభూతుని చేస్తానని చెప్పి తాడుతో బంధితుణ్ణి చేస్తాడు. ఆపత్సమయంలో శత్రువునైనా అవహేళన చేయరాదని, పగవారెత్తివచ్చినప్పుడు మనం నూట ఐదుగురమని హెచ్చరించి భీముడుని వెళ్లి రారాజు ను రక్షించమని ధర్మరాజు ఆదేశిస్తాడు. చిత్రసేనుడు రారాజును బందీగా తీసుకొని వెళ్తుంటే అడ్డగించి భీముడు రారాజును బంధవిముక్తున్ని చేస్తాడు. “దాయాదుల దయాభిక్షతో సంపాదించుకున్న నీ తుచ్చప్రాణాలను ఏం చేస్తావు. మరణించి మట్టిపాలు చేస్తావా. ఫో... అరువుతెచ్చుకున్న ప్రాణాలు అరచేతిలో ఉంచుకొని హస్తినాపురికి చేరుకో” అంటూ అపహాస్యం చేసినప్పుడు రంగారావు భీముని వైపు ఒక నిర్లక్ష్యపు చూపు విసరుతాడు. భీముడు భీకరంగా చెప్పిన డైలాగులు తుస్సుమంటాయి. అవమాన క్షుభితుడైన రారాజును అంతరాత్మ క్షోభింప
జేస్తుంది. అద్దంలో కనిపించే అంతరాత్మతో రంగారావు సంభాషణలు చూసి తీరవలసిందే. 

పండంటి కాపురం

పండంటి కాపురం సినిమాలో రాణి మాలినీ దేవి వద్దకు వచ్చి రంగారావు చెప్పే డైలాగులు కన్నీళ్లు పెట్టిస్తాయి.  “ఎవరని చూస్తున్నావా అమ్మా. నేను నారాయణరావుని. నీకు అన్యాయం చేశాడనుకుంటున్నావే... శ్రీనివాసరావు...అతడు నా తమ్ముడే. ఆత్మీయతను చంపుకొని అహంభావాన్ని పెంచుకున్నావు. నీ చుట్టూ అగాధాన్ని ఏర్పరచుకొని, సానుభూతి చూపించాలన్నా దూరదూరానికి తరలిపోయావు. ఆడదానివన్న మాటే మరచిపోయావు. నీ ప్రతీకార చర్యలు వాడి వరకే పరిమితం కాలేదు. అమాయకులైన ఇల్లాలు, పిల్లలు ఆవేదనకు గురయ్యారమ్మా. చివరికి అది ఆ తల్లికి కడుపు చిచ్చు కూడా తెచ్చిపెట్టింది. దీనికంతటికీ వాసు ఒక్కడే కాదమ్మా, కొంతవరకు నేను కూడా కారకుణ్ణే. తెలిసి చేసినా, తెలియకచేసినా తప్పు తప్పే. అందులో నాపాలు పంచుకోక తప్పదు. మాది పండంటి కాపురం. మా కుటుంబంలో నామాటకు ఎవరూ ఎదురు చెప్పరు. చావు బ్రతుకులమీద వున్న నా చెల్లెలు కోరిక కాదనలేక ఆమె కూతురు లక్ష్మికి, వాసుకు పెళ్లి నిశ్చయం చేశాను. వాణ్ణి వెంటనే రప్పించడం జరిగింది. వాడు ఆ పెళ్ళికి అడ్డుచెప్పుకోబోయినా, నా పెద్దరికం వాడి నోరు మూయించిందమ్మా. లక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేయించాను. కానీ నా తమ్ముడు జీవితాన్ని ముళ్లబాటలోకి యీడ్చిన వాడినయ్యాను. నా చెల్లెలి కోరికైతే తీర్చగలిగాను కాని తమ్ముడి మొహంలో చిరునవ్వు చూడలేకపోయాను. వాడు పెళ్ళయితే చేసుకున్నాడుగాని, దాంపత్య సుఖం అనుభవించలేక పోయాడు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవాడిలాగా దిగులుగా ఉండేవాడు. ఒకనాడు నీ ఫోటో చేతపుచ్చుకొని కంట తడి పెడుతూవుంటే దగ్గరకు తీసి అడిగితే జరిగిన దారుణంమంతా చెప్పి విలవిలలాడాడు. నేను కొయ్యబారిపోయానమ్మా. అగ్నిసాక్షిగా కట్టుకున్న లక్ష్మి జీవితాన్ని, నీ జీవితంలాగే కన్నీటి మడుగులా చేయవద్దని నచ్చజెప్పాను. చివరికి మనసు ఉండబట్టలేక నిన్ను వెదుక్కుంటూ బయలుదేరాను తల్లీ. కానీ నీ వూరు వచ్చేసరికి నీ తండ్రిగారు చనిపోయారని, నువ్వు ఊరొదిలి వెళ్ళిపోయావని విని నిరాశతో కుంగిపోయా నమ్మా. నిరాశతో వెళుతూ ఉంటే నువ్వు స్పృహతప్పి పడివుండడం చూశాను తల్లీ. ఆసుపత్రిలో పాపను కని నువ్వు వెళ్ళిపోయిన తరవాత నువు కన్నపాపను తీసుకొచ్చి నా బిడ్డగా పెంచానమ్మా. ఈ సంగతి తెలిస్తే వాసు జరిగిందంతా తలచుకొని ఏం బాధపడతాడోనని, ఈ పాప నీ పాపేననే రహస్యాన్ని ఇంతవరకు దాచే వుంచానమ్మా. ఇంతవరకూ నా కూతురనుకుంటున్న శాంతి నీ శాంతేనమ్మ” అంటూ చెప్పిన సుదీర్ఘ డైలాగులు ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని ద్రవింపజేశాయి.  ఆ సన్నివేశంలో రంగారావు నటనను చూసి కంటినీరు కార్చని ప్రేక్షకుడు వుంటాడంటే నమ్మలేం. (వీడియో వీక్షించండి)

తోడూ నీడా

తోడూ నీడా చిత్రంలో ఒక భావోద్వేగమైన సంభాషణ. రంగారావు భానుమతితో రామారావుకు రెండవ వివాహం జరిపిస్తాడు. కానీ తన తొలిభార్యను మరువలేని రామారావు గురించి భానుమతితో రంగారావు అనునయిస్తూ మాట్లాడే సంభాషణ లో రంగారావు లోని దైన్యం గోచరిస్తుంది. “ ఏమిటమ్మా అలావున్నావ్. నాకు తెలుసమ్మా. దేవుడు నీ పూజను అంగీకరించలేదు. కొందరికి త్యాగం, ప్రేమ అనే మాటలే తెలుసు. వాటి ఆంతర్యం, పరమార్ధం కొందరికే తెలుసు. నీకు నేను ఏం చెప్పగలనమ్మా. గోపి రాధను మరచిపోలేకుండా వున్నాడు. నువ్వే మరపించాలి. అతణ్ణి మారిన మనిషిని చెయ్యాలి. పాపకు తల్లి కావాలని నేనే అతన్ని పెళ్ళికి ఒప్పించాను. అమ్మా. ఏనాడు నువ్వు ఆ పాపకు తల్లి కాగలుగుతావో ఆనాడే అతనికి నువ్వు భార్య కాగలుగుతావమ్మా. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలమ్మా”. ఈ డైలాగు వస్తున్నప్పుడు రంగారావు హావభావాలు చూడాలి. వాహ్! గ్రేట్!!

 

ఎడమనుంచి...సర్వశ్రీ సుంకర రామకృష్ణ, టి.రాజగోపాల్, చిట్యాల విఠోబా అంబాజీ, రావి కొండలరావు, రాజేంద్రకుమార్,  షణ్ముఖాచారి, అద్దేపల్లి శ్రీమన్నారాయణ, అరుణ కుమారి. సన్మాన స్వీకర్త పురాణం వెంకట రమణ.

పై ఫొటోలో శ్రీ పోలిశెట్టి నాగేశ్వర రావు.

కొండలరావు గారి గోడ గడియారం 09.00 గంటల సమయం చూపించింది. అలసట ఎరుగని అనుభూతుల దొంతరలు మదిలో రీళ్ళు తిరుగుతుండగా సభ్యులు కొండలరావు గారికి కృతఙ్ఞతలు తెలిపి సెలవు తీసున్నారు. లిఫ్ట్ దాకా కొండలరావు గారు వచ్చి సాగనంపుతుంటే “మేస్టారూ... మీరురాకండి. మేము వెళ్తాం” అని వారిస్తున్నా, లిఫ్ట్ వద్దకు వచ్చి గేటు మూసివేస్తూ “భలేవారే...మీరు మళ్ళీ వెనక్కు వచ్చి చర్చ కొనసాగిస్తారేమోననే అనుమానంతో వచ్చి లిఫ్టు గేటు మూశాను. అంతే” అంటూ చమత్కరించి మందహాసంతో మాకు వీడ్కోలు పలికారు.

(రిపోర్టర్: షణ్ముఖాచారి) 
 


Tags: sangeeta sahitya samakya, sv ranga rao gari 100th celebrations, shata jayanti, sv rangarao garu

comments